దాసరిని డైరెక్టర్‌ని చేస్తానంటూ తిప్పించుకొని మాట తప్పిన నాగభూషణం!
on Jun 28, 2021
ఎస్వీ రంగారావు, రాజబాబు టైటిల్ రోల్స్ చేసిన 'తాత మనవడు' చిత్రంతో దాసరి నారాయణరావు దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ సినిమాని ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించారు. ఆ సినిమాతోటే ఆ నిర్మాణ సంస్థ కూడా ప్రారంభమైంది. అదివరకు ఫల్గుణ ప్రొడక్షన్స్‌లో రాఘవ భాగస్వామిగా ఉండేవారు. నిజానికి దాసరిని దర్శకునిగా పరిచయం చేస్తానని తిప్పించుకుంది 'రక్తకన్నీరు' నాగభూషణం. కానీ ఆయన దాసరికి ఇచ్చిన మాటను తప్పారు.
ఎన్టీఆర్ హీరోగా నాగభూషణం నిర్మించిన 'ఒకే కుటుంబం' చిత్రానికి దర్శకుడైన భీమ్‌సింగ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు దాసరి. ఆ సినిమాకు డైలాగ్స్ అసోసియేట్‌గా కూడా దాసరి వ్యవహరించారు. ఆయన టాలెంట్‌ను గమనించిన నాగభూషణం ఒకరోజు దాసరిని పిలిచి డైరెక్టర్‌గా ఎక్కడ అవకాశం వచ్చినా ఒప్పుకోవద్దనీ, తన బ్యానర్‌లో తర్వాత సినిమాని ఆయన డైరెక్షన్‌లోనే తీస్తాననీ చెప్పారు. సరేనని 'ఒకే కుటుంబం' తర్వాత అసోసియేట్ డైరెక్టర్‌గా ఎన్ని అవకాశాలు వచ్చినా అన్నీ వదులుకున్నారు దాసరి.
ఆ టైమ్‌లో తమిళంలో విడుదలైన 'శపథమ్' మూవీని చూడమనీ, దాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నాననీ నాగభూషణం చెబితే, ఆ సినిమా చూశారు దాసరి. అది నాగభూషణంకు సరిపోతుందనిపించి, ఆ విషయమే చెప్పారు. స్క్రిప్ట్ పని ప్రారంభించమని చెప్పడంతో, డైలాగ్ వెర్షన్ రాయడం మొదలుపెట్టారు దాసరి. అయితే 'శపథమ్' ప్రొడ్యూసర్స్‌తో పొసగకపోవడంతో ఆ సినిమా హక్కులను నాగభూషణం తీసుకోలేదు. మరో సబ్జెక్టుతో సినిమా చేద్దామన్నారు. సరేనని తాను రాస్తున్న డైలాగ్ వెర్షన్‌ను పక్కన పెట్టేశారు దాసరి.
నాగభూషణం 'ప్రజానాయకుడు' సినిమా తీయాలని సంకల్పించి, దర్శకుడిగా దాసరిని కాకుండా వి. మధుసూదనరావును ఎంచుకున్నారు. ఈ విషయం తెలియగానే నాగభూషణంను నిలదీశారు దాసరి. ఆయనేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. కానీ దాసరి మనసుకు కష్టమనిపించి, ఆయన దగ్గర్నుంచి వచ్చేశారు. కె. రాఘవను కలిసి 'తాత మనవడు' కథ చెప్పారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు దాసరి. ఆ తర్వాత డైరెక్టర్‌కు స్టార్ హోదాను కల్పించిన వ్యక్తిగా తెలుగుచిత్రసీమలో చరిత్ర సృష్టించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
